పేజీలు

23, ఆగస్టు 2011, మంగళవారం

డల్లాసులో మేడసాని మోహన్ శతావధానము


ఈ వారాంతము (అగష్టు 21వ తేది) డల్లాసులోని డి.ఎప్.డబ్లు  హిందూ దేవాలయములో అపూర్వ పంచసహసా్రవధాని శ్రీ మేడసాని మోహన్ గారి శతావధానము వైభవోపేతముగ జరిగినది. అమెరికాలో రెండోసారి మాత్రమే జరిగిన ఈ చారిత్రాత్మక శతావధానము ఒక విన్నూత్నమైన విధముగ సాగినది. సాధారణముగ మూడు రోజులు సాగవలసిన కార్యక్రమాన్ని ఏ మాత్రము ప్రమాణాలు తగ్గకుండా కేవలము ఒక్క రోజులో పూర్తిచెయ్యటము అలాగె కావ్యపఠనము ఆశువు ప్రక్రియలను కలిపి ఒకే అంశముగా చెయ్యటము ఓ అపూర్వమైన ఘటన.

సుమారు 80 మంది పృచ్ఛకులు (వంద మంది దొరకటము అంత సుళువైన విషయము కాదు లెండి) దత్తపది, సమస్య, వర్ణన, కావ్యపఠనము, ఆశువు అనే ఐదు అంశాలను నిర్వహించారు. ఇవే గాక హ్యూష్టన్ వాస్తవ్యుల శ్రీ వంగూరు చిట్టెన్ రాజు గారు నిర్వహించిన అప్రస్తుత ప్రసంగము, కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించినది. ఉదయము 9 నుండి సాయంత్రము 8.30 వరకు సాగిన ఈ కార్యక్రమము సభికులను, పద్యసాహితీప్రియులను, పృచ్ఛకులను ఆద్యంతము అలరించినది.

సాహితీ కార్యవర్గ సభ్యునిగా, పృచ్ఛకునిగా నాకు ఇది ఒక అపూర్వమైన అనుభవము. ఒక అసాధారణ ప్రజ్ఞావంతుని అలాగె ఒక క్లిష్టతరమైన ప్రక్రియను అతి సమీపముగ చూడటము రోజువారి జరిగే విషయము కాదు మరి. మేడసాని గారి ధారణా పటిమ, సమయస్పూర్తి దానిని మించి అతివేగముగ చక్కటి ఆశు పద్యాలను వల్లెవేయగల వారి ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచినది. టెరా టెరా బైటులు రేము ఉండే సూపరు ప్రాసెసింగ్ కంప్యూటరును గుర్తు చేసినది. ఆఖరున వచ్చే అవధాని ప్రశంసా కార్యక్రమములో ఇదే విషయాన్ని పద్య రూపములో (నేను సైతము :-) ) సభకు వినిపించాను.

ఈ శతావధానములో అవధానిగారు పూరించిన కొన్ని చక్కటి దత్తపదులు, సమస్యలు (కర్టసి భాస్కర్ రాయవరము) 


భామ, మామ , దోమ, చీమ – చిన్ని క్రిష్ణుడు యశోద దగ్గర చేసిన గారాబం గురించి
భామహనీయమై సరస బంధురమై అలరారు నట్లుగా
మామక ముక్త లీలల సముంచిత చేష్టల చూచుచున్న ఏ
దో మహితాత్మ మాత్రు మృదు దోహద లీల తలంచి నంతనే
చీమకు బ్రహ్మకున్ ప్రకృతి సేవలు చేసెడి భాగ్య మబ్బగన్

సిగ్గు, పెగ్గు, రగ్గు, ముగ్గు – మద్యపాన నిషేధం గురించి
ఎగ్గు సిగ్గు లేక ఇంపు సొంపులు లేక
పెగ్గు పట్టుచున్న పెద్దలున్న
మద్య పానగతుల మలయుదురగ్గు
ముగ్గు బాలతోడ నొప్పునేమో?

చెక్డాముల్ మన దేశమందు వికటిస్తిత మైనట్లుగా
చెక్డీల్ కోరిన వారికిన్ పటు శ్రీమంతమై ఒప్పగా
మెక్డోనాల్డ్ న ఇడ్లి వోలె అవి ఎవేమిన్ ప్రసాదించునే
మెక్డోనాల్డ్ న ఇడ్లి తింటివి గదా మీమాంస మింకేలరా!

సంగత వీర రౌద్ర విలసత్వమునన్ బలరామ కృష్ణులు
తు్తంగ బల ప్రతాప దోహద కేళి చరించు వేళలో
హంగుగ కంసు మల్లుర రయంబుల.. అట్టి.. వీ
రంగులు రంగ మధ్యమున రక్తము గార్చి హతమ్ము జేసిరా!

స్వాంత మొప్పగా ప్రశాంత ప్రభాతాన
వేడి పానమునకు వెదకుచుండ్రు
అట్టివారి కెల్ల ఆనందముగ పాల
బూతు పదము మేలు భువనమందు
-----------------------------------------------------------

ఇకపోతే కొంచెము సెల్ఫ్ డబ్బా.. పృచ్ఛకులు అవధానిని పొగడటము ఒక సంప్రదాయము.. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను చెప్పిన పద్యాలు..

అచ్చెరువొందురీతి నవధానములెన్నియొ నాల్గు మూలలన్
ముచ్చట జేసి వచ్చిరిగ; మోదము కూర్చిరి డల్లసందున
నె్మచె్చడి పద్యముల్నుడివి; మీరుచు రంజిల చేసిరీ తిథిన్;
వచ్చిన మేము ధన్యులము వాణిసుతాగ్రజ! వందనమ్మిదే 

వ్యాకరణపురాణపద్యకావ్యములందు

      సాటిలేని యపార 'డేటబేసు'

పంచశతసహస్ర ప్రశ్నలొకపరిగ
      పూరించగల 'మల్టిప్రొసెసర్రు'
అసమంజసప్రలాపాటంకముల 'ఇంట
      రెప్టు' లాపని వాహ్ భలె 'పెరిఫెరలు'
వేలసమస్యప్రహేళిక లొకసారి
      వచ్చి 'రేము'ని నింప వచ్చెరువుగ

ట్విటరు గూగులు ఇంటరునెటు నిఘంటు
ల కలదె తమబోలిన యపార పదగరిమ
కంప్యుటరు గింప్యుటరు సాటి కావు తమకు
మేటి కవి!! యవధానేశ!! మేడ సాని

క్రికెటుకు 'సచిన' బాస్కెటు కేమొ 'మిఖెలు'
'ఆలి' యెగ బాక్సు చేయగ అవని యందు
సాకరుకు 'పీలె' గోల్ఫుకు రాజు 'ఉడ్సు'
సాటి మీకేరు? అవధాన సార్వభౌమ

4 కామెంట్‌లు:

  1. ధన్యవాదాలు.
    ఈ అవధానం గురించిన కొంత సమాచారం అమెరికా మిత్రులు చంద్రశేఖర్, డా. గన్నవరపు నరసింహ మూర్తి గారల వలన తెలిసింది. మీరు వివరంగా తెలియజేసారు.
    ఇక మేడసాని వారిపై మీ ప్రశంసాపద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.

    ‘శంకరాభరణం’
    http://kandishankaraiah.blogspot.com

    రిప్లయితొలగించండి
  2. పెద్దలు శ్రీ కంది శంకరయ్యగారికి,

    నమస్కారము. నా ప్రశంసాపద్యాలు మీకు నచ్చటము నాకు మరింత ఆనందము కలిగించినది. మేడసాని
    మోహన్ గారు కూడా ఎంతో అభినందించి నాకు ప్రోత్సాహాన్నిచ్చారు.

    ఇక గన్నవరపు నరసింహమూర్తి గారు నాకు చిరకాల సాహితీ మిత్రులు మరియు గురువుగారు పద్యాలు రాయటములో.

    -సురేష్ కాజ

    రిప్లయితొలగించండి
  3. ఇంత చక్కని పద్యరచనా పాటవం గలిగిన మిమ్మల్ని ‘శంకరాభరణం’లో సమస్యాపూరణలు చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. Suresh:

    great post and must have taken effort to post this. it is it good effort to share the details with those who couldn't attend.

    It must have been good avadhanam with 80 quizzers/challengers. Is there a video link available? Please post if available.

    BTW- is it possible to repost the padulu /if possible removing all sanskrit words and so Telugu folks like me that don't understand 11-18th century pseudo telugu style (created from sanskrit by adding du, mu, vu, lu) can understand them?

    I learned a new sanskrit word callled 'Prahelika' and that it means quiz. And other words here that I still need to understand.

    రిప్లయితొలగించండి