పేజీలు

8, జూన్ 2010, మంగళవారం

పలుగు పార - టెక్సాస్ లో రైతు బిడ్డ


ఓ నెల రోజుల క్రితమనుకుంటాను మా నార్త టెక్సాస్ లో మాంచిగా వర్షాలు పడ్డాయి. స్ప్రింగ్ వెళ్ళి సమ్మర్ వచ్చింది. ప్రతి సంవత్సరము లాగే ఈ సారి గూడా నాకు అదే తంటా వచ్చి పడింది. చెట్లన్నీ చిగురించాయి. దాంతో పాటు మా పక్కింటి వాడి 'లాను'లో గడ్డి  కూడా, కాంప్లాన్ తాగిన పిల్లాడిలా, ఏపుగా పచ్చగా పెరగటము మొదలయ్యింది. అవును మరి వాడు అదేదో ఎరువూ, లాన్ ఎమర్జెంటూ, మన్నూ మశానమూ  వేసా్తడు గదా! !. ఎప్పటి లానే నేను ఆ చిన్న పని (కూడా) చెయ్యటము మర్చి పోయాను. 

          మీ ఎదురింటోడో, పక్కింటోడో మీలాగా పని దొంగ కాకుండా ఉంటే నా బాధేంటో మీకు బాగా అర్థమయ్యేది.  దానికి తోడు, వాడు వారాంతము ఎప్పుడొస్తుందా, ఎప్పుడు తన లాను లోని గడ్డిని పట్టు తివాచి లాగా మారుద్దామా అని ఎదురు చూస్తూంటాడయె్య.   వాడికున్న "స్టేట్ఆఫ్  ది ఆర్ట్ " లాన్   మోవింగ్  పనిముట్లతో,  పడుచుపెళ్లానికి ఇసీ్త్ర  చేసిన మెత్తటి చిలకపచ్చ కోకరైకలు చుటి్టనట్లు, ప్రతి వారము  దానిని తీర్చి దిద్దుతాడు. దాని పక్కన మా లానెప్పుడూ  ' హైదరాబాదులో IT ఉద్యోగి సరసన  సెక్రటేరియట్ క్లర్క్' లాగా   వెలవెల పోతూనే ఉంటుంది.
          కొత్తగా ఇంట్లోకి మారిన రోజుల్లో నేను గూడా ఎంతో ఆవేశముతో, మోవర్లూ  ఎడ్జర్లూ లాంటి పనిముట్లు కొని  Home Depot వాడిని  ఓ మాదిరిగా బాగానే పోషించాను.   ప్రతి వారము కొత్త పెళ్లాములా, ఎంచక్కగా లానుని తీర్చిదిద్దేవాడిన.  నా మిత్రుడొకడు - "నీకంత సీను లేదు ఎందుకు వృధా శ్రమ" అని  నాకుచిలక్కి చెప్పినట్టు చెప్పినా నేను వింటేనా.  అచ్చమైన తెలుగోడినయ్యే.  నా ఆరంభశూరత్వము ఆరు నెలల తరవాత అంత మయి్యంది. Mowingపనిముట్లన్నీ గరాజిలో ఓ మూలున్న గోల్్ఫ క్లబ్బులు, డంబెల్లులు , టెన్నీసు రాకెట్ల పక్కకెళ్లి నక్కాయి.  Lawn mowing job ని ఓ హిస్పానిక్ వాడికి outsourcing చేసి, Economyకి  నా వంతు తోడ్పాటందించానన్న తృప్తి మిగుల్చుకున్నాను.  ఆ 'మొరాకో' పుణ్యమా అని మా లాను గూడా అప్పటినుంచి ప్రతి రెండు వారాలకూ, పక్కింటోడిదంత కాక పోయినా ఓ మాదిరిగా బాగానే ముస్తాబయ్యేది.
          ఇక వర్తమానానికోస్తే  - అందరూ హోమ్  డిపోలకూ నర్సరీలకూ వెళ్ళి, రకరకాల పూలూ కాయగూరల మొక్కలూ తీసుకొస్తుంటే, peer pressureవలన నేను గూడా వెళ్లవలిసి వచ్చింది. అలా వెళ్లినోడిని ఏదో శాసా్త్రనికి రెండో మూడో మొక్కలు తెస్తే సరిపోయేదా? లేదే- ఆవేశముగా ఓ డజను మిర్చి, టమోట, వంగ నారు మొక్కలు తీసుకొచ్చాను.  మా శ్రీమతి తన వంతుగా బంతి పూలూ, మందారాలూ బాగున్నాయని మరిన్ని తీసుకొచ్చింది.  వాటితో పాటు ముటా మేసి్త్ర  లాగా నేను ఐదారు ఎరువుల మూటలు గూడా మోసుకుంటూ  తెచ్చి, బాక్ యార్డులో వాటన్నిటిని చక్కగా లైనులో అమర్చాను.
          సరిగ్గా ఆ రోజునుంచి మొదలయ్యాయి నా తిప్పలు. ప్రతి రోజూ పొద్దునే లేచి, చేత్తో కాఫీ కప్పు పట్టుకుని కిటికిీ గుండా బయటకు చూస్తే అవన్నీ కనపడేవి.  ఇరుకు కుండీలలో ఉన్నా మొదటి కొన్ని రోజులు ఎంతో ఉత్సాహముతో పలకరించేవి.  ఓ వారము గడిచి పోయింది. రెండ్రోజులు మించి  తనింట్లో తిష్టేసిన అతి్తంటి చుట్టాన్ని చూసినట్టుగా చూడటము మొదలెట్టాయి నా వంక.  'ఎప్పుడు మమ్మల్ని ఈ ఇరుకు కుండీ కొంపలో నుంచి తీసి ఆరు బయట చక్కటి పాదులో పెడతావు?' అని నన్ను నిలదీసి అడగసాగాయి. వాటి బాధ పడలేక ఓ రెండు వారాలనుంచి  కిటికీ గుండా బాక్ యార్డ్ లోకి చూడటమూ వెళ్లటమూ   మానేసాను.
          ఎన్ని రోజులని తప్పించుకోగలును? కొన్ని మొక్కల వేర్లు పెరిగి పెరిగి కుండీల నుండి బయటకు పాక్కుంటూ నా వైపుకు రాసాగాయి. టమాటా మొక్కలు, పూలు పూసి కాయలు గూడా కాయటము మొదలెట్టాయి.  ఒక పచ్చి మిర్చి మొక్క తన జ్వాలా శరాలనెన్నో నామీదకు సంధించి పోరాడి ఆఖరకు  వీర స్వర్గమలంకరించింది. అందుకే ఇక ఈ ఆదివారము నాకు తోట పని చెయ్యక తప్పలేదు. 'ఏసీ' లకు  అలవాటు పడిన బాడీకి,  బయటెండ పిలానీ వేసంగిని మరిపించేట్టుగా అనిపించింది. టెక్సాస్ సైజు గ్లాసునిండా లెమనేడు తాగి రెండు మూడు వామప్పు బస్కీలు తీసి పని చెయ్యటానికి బయలుదేరాను.
          ఎంతైనా రైతు బిడ్డను గదా. దానికి తోడు ఒంట్లో ఇంకా ఎక్కడో పల్లె రక్తము ఉరకలెత్తుతూనే ఉన్నది. షార్టేసాను. చొక్కా తీసాను. తలకు తుండు చుట్టాను. పలుగూ పారా పట్టాను. తీర్ధయాత్రకు తిరుపతో లేకపోతే ప్రేమ యాత్రకు పారిస్సో ఈ సంవత్సరము వెళ్ల్లాల్సిన అవసరము అస్సలు లేదు.. ఎంచక్కగా మనము గుండమ్మ కథ లో  ఎ.ఎన్.అర్-జమున జంటలా, పక్కోడికి ఇనపడకుండా డుయట్టు పాడుకుంటూ పనిచేద్దామని,  మా శ్రీమతినితోటి తోట కూలీగా తీసుకుని బాక్ యార్డ్ కి వెళ్లాను.  ఇదేదో కూల్ గా ఉందని మా పిల్లలూ, వాళ్లెనక తోకూపుకుంటూ మా శునక 'రాజు' గూడా వచ్చాడు.
          ఇక పోతే అమెరికాలో పలుగూ పారలు,  వాటితో నా అనుభవము గురించీ  ఇక్కడ ఓ మూడు ముక్కలు చెప్పాలి. అమెరికాకు రాక ముందు నాకు తెలిసినంతవరకూ ఏదన్నా తవ్వాలంటే గడ్డ పలుగొక్కటే సాధనము. గడ్డ పలుగనేది మునుగఱ్ఱంత పొడవుండి ఇనుముతో చెయ్యబడి మొదలూ చివరా తొవ్వటానికి తగ్గట్టుగా ఉంటుందనీ,  అలాగే తవ్విన మట్టిని తియా్యలన్నా  మిరపచేలో కాలవకు మడవ వేయాలన్నా పారను మించిన పనిముట్టు మరోటి  లేదనీ గుర్తు. సొంతముగా నాటి అందరి దగ్గిర కె్రడిట్ కొట్టెయ్యాలనే ఆలోచనతో ఇంటికొచ్చిన కొత్తలో రెండు మూడు పెద్ద చెట్లు నర్సరీ నుండి తీసుకొచ్చాను.  తీరా హోమ్ డిపోకి వెళ్లి ఎంత వెతికినా నాకు తెలిసిన పలుగుపారలు కనపడితేనా. ఆక్కడ పనిచేసేవాడిని పిలిచి, నాకు తెలిసిన రకరకాల ఇంగ్లీషు పేరులతో, కావలసిన వాటి గురించి వాకబు చేసాను. ఏమీ ప్రయోజనము కలగలేదు. చివరికి ఆంగికము వాచకములతో కూడిన నా  ఏకపాత్రాభినయము పుణ్యమా అని వాడు గడ్డ పలుగ లాంటి పలుగూ, నుంచుని తవ్వే పార (Spade) తెచ్చిచ్చాడు.  వంగకుండా వాడే ఈ కొత్త రకము పార  సుళువేమిటో నాకు ముందు ముందు బొజ్జ పెరిగేకొద్దీ మరింత  బాగా బోధపడింది .
          వాటిని పుచ్చుకుని రెట్టించిన ఉత్సాహముతో ఇంటికొచ్చి పని మొదలెట్టా. అందరిలా ముందుగా తవ్వటానికి  అమెరికా పారను వాడాను. ఎంత కష్టపడ్డా గుంట బెత్తెడు లోతును మించి పెరగలా. ఇలా కాదని గడ్డ పలుగు బయటకు తీసా. ఏదో సినిమాలో కృష్ణంరాజులాగా, బ్యాక్ గ్రౌండ్లో "ఆడుతు పాడుతు పనిచేసు్తంటే అలుపు సొలుపేమున్నది"  పాట మ్యూజిక్ వస్తూండగా, పలుగుతో ఓ పోటు పొడిచాను. గుంట లోతు కొంచెము గూడా పెరగలా.  మరో సారి ఆతరవాత ఇంకో సారి ప్రయత్నించా. పెద్దగా తేడాలేదు. ఈ సారి వెనకనుంచి ఎవరో కిసుక్కున నవి్వనట్టుగా అనిపించింది. నిజముగానే నవ్వారనుకుంట. నాకు ఎక్కడ లేని పౌరుషము ముంచుకొచ్చింది. దానితో పాటు రెట్టించిన బలము కూడా. 'జై భజరంగ భలి' అని మనసులో గట్టిగా అనుకొని బలమంతా కూడగట్టుకొని  గునపాని్న గట్టిగా కిందకు దింపాను. ముందుగా తళుక్కు మని మెరుపు. ఆ తరువాత చిన్న ఉరుము. వెనువెంట ఉప్పెనలా పాతాళ గంగ వెల్లుబుకింది. ఎక్కడ చూసినా నీళ్ళు.  అంతా జలమయము. రెండు నిమిషాల తరవాత అర్థమయి్యంది నేను చేసిన ఎదవ పని. గడ్డ పలుగుల తాకిడి తట్టుకునే సత్తా భూమిలో ని pvc పైపులకు ఉండదని బాగా తెలిసొచ్చింది.  ఆ దెబ్బకి గెడ్డ పలుగు వాలంటరీ రిటైర్మెంటు పుచ్చుకుని గరాజిలోకి సుదీర్ఘ విశ్రాంతి నిమిత్తము వెళ్లింది.
          సరిగ్గా ఇన్ని రోజులకు మళ్లీ బయటకు వచ్చింది, తన సహచరుడైన అమెరికా పారతో.  న్యు ఇయర్ రిజల్యూషన్ తో కొత్తగా జిమ్ము కెళ్లే వాడి లాగా, ఉత్సాహంతో మాంచి ఎండలో తవ్వటము మొదలెట్టా.   రెండు మూడు పాదులు చేసి, టాప్ సాయిలూ ఎరువూ కలిపి టమాటా మొక్కలు నాటా.  నా పని తనాన్ని చూసి నాకు నేనే ఎంతో ముచ్చట పడ్డా. ఆ మొక్కలు గూడా ఆనందముగా తలలూపినట్టగా కనిపించాయి.  ఆనందముతో మరిన్ని పాదులకు  మట్టిని తవ్వాను.
          ఎంత రైతు రక్తము ఉరకలేస్తున్నా, పదిహెనేళ్ల నుంచి మద్యమాంసాలతో  ప్రేమగా  పెంచి పోషించిన కండరాలమీది మెత్తని పొర,  అడుగడుగునా నా పనికి అడ్డుతగుల్తూనే  ఉన్నది. ప్రతి రెండు నిమిషాలకు బ్రేకులు (break – a new word in my vocabulary courtesy my daughter) తీసుకోమంది. మా అమ్మాయి పర్యవేక్షణలో ఈ తోట పని రెండు గంటలు సాగింది. ఎంచక్కగా తను మాత్రము, నీడలోని కుర్చీలో కూర్చుని పాదులు ఎలా తవ్వాలి, మట్టిన ఎలా పడెయ్యాలి అనే విషయాలు కూలంకషముగా నాకు వివరించింది.  నా బాసు ఏ  'Peter  or Paul ' ఎందుకో,  విషయజ్ఞానమంత లేకపోయినా  వాళ్లు నాతో పనులెలా చేయించగలుగుతారో ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది.  ఈ గాలీ నీరూ పుణ్యమా అని ఆ లక్షణాలు చిన్నప్పటినుంచే వచ్చేస్తాయనుకుంట!!
          పాదులు చేసి,  మొక్కలన్నీ నాటేటప్పటికి నా తల ప్రాణము తోకకొచ్చింది. వొంట్లో పులుసంతా చెమట రూపములో బయటకొచ్చెయ్యటము మూలాన షుమారు నాలుగైదు పౌండ్లైనా తగ్గుంటాను. 'నానా ఎందుకింత శ్రమ? ఎన్ని ఎల్బీలు కాయబొయుతున్నాయి? We can buy  all this stuff in Kroger at a very  very low price"  అని తేలికగా తేల్చి పారేసింది మా అమ్మాయి. అది!!! నా ఘర్మ జలానికి పెట్టుబడిదారైన షరాబు కట్టిన వెల. నే చేసిన శ్రమకు ప్రతిఫలమింతేనా అని అలిసిన నా వళ్లు ఆక్రోశించినది.  నవ్వుతూ నా వంకకు చూస్తున్న వంగ చెట్లు మాత్రము, "మమ్మల్ని సాకి మరో జన్మనందించిన నీకు మేమేమివ్వగలము" అని వవ్వుతూ పలికినట్లనిపించింది. నా అలసటంతా మటుమాయ మయి్యంది. చూద్దాము రేపు నా బాడి పరిస్తితి ఎలా ఉంటుందో,  ఈ మొక్కలెలా ఉంటాయో!!

17 కామెంట్‌లు:

 1. అయ్యో పాపం, తెలుగింటి రైతుబిడ్డ గారు ఎన్ని కష్టాలు పడ్డారండీ, మీరురాసిన విధానం వల్ల మీ కష్టాల్ని కూడా నవ్వుకుంటూ చదవాల్సి వచ్చింది. తర్వాత కథ కూడా అంచెలంచెలుగా రాయండి.

  రిప్లయితొలగించు
 2. బాగుందండి. ఇలా టెక్సాస్ లో వుండే వాళ్ళు బద్దకిస్తే ఎలా, ఏదో మాలా న్యూ ఇంగ్లాండ్ లో లా ఆరునెలలు లోన కూర్చొని బద్దకమొచ్చిందంటే అర్ధం వుంది కాని. ఈ పాటీకి మీకు పిందలెయ్యొద్దు టొమొటా లూ గట్రా.. బాగ చెప్పేరు అమెరికాలోని మన రైతు రక్తం చిందులాటలు ఆ పైన అమెరికా లో అలవాటైన సౌఖ్యం పెట్టే ఆరడి.. :-)

  రిప్లయితొలగించు
 3. బాగుందండీ రైతు బిడ్డ గారూ, తెలుగులో బ్లాగటానికి మీరు కొత్తనుకొంటా..కొంచెం అప్పుతచ్చులూ, పుచ్చులూ చూసుకోండి.

  రిప్లయితొలగించు
 4. baga peruguthayilendi, me kasthaniki

  రిప్లయితొలగించు
 5. మీ టపా నచ్చింది ...

  రిప్లయితొలగించు
 6. చాలా బాగుంది.

  -సాహితి & సింథు

  రిప్లయితొలగించు
 7. chala bugundi saaru mee prayathnam! I'm hopeful it would be fruitful.

  రిప్లయితొలగించు
 8. @కల్పన పంట బాగా పండితే మరో టపాలో దాని గురించి తప్పకుండా డబ్బా కొడతాను.
  @భావన మీరు చెప్పినది నిజమే. ఇక్కడ కొంతమంది రెండో రౌండ్ మొక్కలు కూడా పెట్టేస్తున్నారు.
  @Bondalapati ధన్యవాదాలు. చిన్నప్పటినుంచి వంకాయల పుచ్చులేరటములో నేను వీకే. Lack of 'attention to details'. ముందు ముందు ప్రయత్నిస్తాను.
  @మందాకిని @శ్రీనివాసరెడ్డి, @ప్రసాద్ గార్లకి, @అజ్ఞాత1 @అజ్ఞాత2 ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 9. చాల తమాషాగా సహజంగా ఉంది

  రిప్లయితొలగించు
 10. ikkada retulu periginayi ruchi vundatala....koncham eedeki pampura bhai,kashtam lo kuda sukhamuntudhi..kada..mama

  రిప్లయితొలగించు
 11. పలుగు, పార అనగానే తోటపని అని తెలిసిపోయి వచ్చానండీ. పూర్వాశ్రమంలో మీరు పలుగుతో అభినవ భగీరథలైనట్లే నేను నా కాలు భూమిలోకి దింపేసా, ఫలితంగా నా రుధిరధారల్లో పుడమిని తడిపేసాను. ప్రస్తుతం మేము ఇక్కడ ఉండేది మిడ్ వెస్ట్ కనుక బయట గడపగల ఆ ఆర్నెల్లు పూర్తిగా తోటపనికే అంకితం..మీ పోస్ట్ వచ్చి నెల కనుకా మీ మొక్కలూ ఎదిగి ఉంటాయి. కాకపోతే మెక్సికన్ వారితో జాగ్రత్తండి, ఈ యేడు నా బెండ మొక్కలు రెండుసార్లు పీకేసాడు. మూడోసారి విత్తు పెట్టి అవి మొలకెత్తేసరికి టమాటా కాపుకొచ్చేసిమ్ది కనుక మాకు బెండ ఇక ప్రాప్తం లేవేమో. నావి ఇక్కడ పెట్టాను.. ఆసక్తి ఉంటే ఓసారి చూడొచ్చు..http://picasaweb.google.com/ushaa.raani/2010#

  రిప్లయితొలగించు
 12. రైతు సోదరా, నేలపై మోజు తీరలేదురా, ఈ ఆయాసమేలరా!! :)

  రిప్లయితొలగించు
 13. @ఉష, మీ రాకతో నా బ్లాగులో మరువపు భావకవితాగుబాళింపులు వెల్లివిరిసాయి. ధన్యవాదాలు.మీ కూరగాయల ఫొటోలు చూసాక మా తోట ఫొటోలు పెట్టాలనే ఆలోచన విరమించుకున్నాను :-)

  @కొత్తపాళీ, ఏమి చెయ్యమంటారు చెప్పండి. దిగినాక తెలిసింది లోతెంతో.

  రిప్లయితొలగించు
 14. chaalaaa bavundandee mee anubhavam.ayithe, sahithee vyavasaayamkante- peratilo 'vyavasaayam' kasthtam.idi naa anubhavamloki vachhina vishayam. padella taravaata ee americalo tolisaarigaa- intivenaka-peratilo-goppulu tavvadam-meerannuttu- gadda paara(gunapam)tho kaakundaa-ithamaargaalanavalambinchi-oka chikkati anubhuthi. aaaa taravaata, benda-beera-totakoora,gongura-chikkudu vittanaalani yedamgaa paati- rojoo-neellu posthooasahanamgaa yeduchoosi-choosivunte- oka roju -katakshisthoo-chinna chinna mokkalu paiki raavadam- ika aanandamtho rojoo-vaatini- pasi pillalla- penchi- poshindam- okanaatiki avi peri-puspinchi-aa taravaata-pindelayi-aa pindelu kaayaluga darshanmivvadamtho-chesina krushi phalinchinanduku- manaku manalne abhinandinchukodam- tiyyati-anubhuthi -meetho deenini panchukodam ado aanandam naaku.
  intakee meeru ' pilani' productaa?-vivaraalu chebuthaaraa?

  రిప్లయితొలగించు