పేజీలు

11, సెప్టెంబర్ 2010, శనివారం

ఉరుకు ఉరుకు.. నెమ్మది నెమ్మదిగ

అది 2004జనవరి ఒకటి. చాలా మంది మిత్రులు తమ తమ  'న్యుఇయర్ రిజల్యూష్ ను'లు, కొత్త సంవత్సరములో మళ్ళీ సరికొత్తగా చెపుతున్నారు. తీర్థము సేవించి తెల్ల గుఱ్ఱము పై  స్వారీ చేస్తున్న బుర్ర నా ప్రమేయము లేకుండానే కొత్త రిజల్యూషన్ని వెల్లడించింది.  ఉదయము నిద్ర లేచాక ఆలోచిస్తే అర్థమయినది - రాత్రి జరిగిన పొరపాటేమిటో. కానీ అప్పటికే అవ్వాల్సిన డామేజి  అయిపోయింది.  నేను 'మారథాన్ ' చేస్తానని కమిట్ అయినట్టు, నాకన్నా ఓ ఆరుగంటలు ముందే అందరికీ తెలిసిపోయింది.

అంతకు ముందు పట్టు మని పది నిమిషాలు కూడా నేనెప్పుడూ గట్టిగా పరిగెత్తిన పాపాను పోలేదు. అలాంటిది 26.2 మైళ్ళు (42.2 కి.మీ) అంటే మాటలా? దానిని ముక్కి మూలిగి,అంచెలంచెలుగా ఎలా సాధించాను(?) అనే విషయము, ముందు ముందు మరికొన్ని టపాలలో వివరిస్తాను.

అది సరే ఇంతకీ ఈ టపా విషయమేంటి అంటారా? అక్కడికే వస్తున్నాను. కొద్ది రోజుల క్రితము, నాతో పాటు పరిగెత్తడము మొదలెట్టిన టామ్ గాడి ఫేస్ బుక్ అప్ డేటు చూసాను. వాడు మారథానేమి కర్మ దాని బాబు లాంటి 'ఐరన్ మాన్ ' నికూడా పూర్తి చేసాడంట మొన్నీమధ్యనే. మరి ఇక్కడ, గత నాలుగు సంవత్సరాలలో  నేను పరిగెత్తడానికీ, జిమ్ముకీ వెళ్లిన రోజులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. దానికి తోడు కొంచెము ఎదిగే వయసు గదా మనది!!.  మాంచి టిప్ టాప్  షేపులో ఉన్నాను.

ఆ ఫేస్ బుక్  అప్డేటు నా కెక్కడో చిన్న ముల్లుతో గుచ్చినట్టనిపించినది. బూజు పట్టి భద్రముగా ఉన్న బూట్లను క్లాజెట్ లోనించి బయటకు తీసాను.  బుడిబుడి అడుగులతో మళ్లీ పరిగెత్తటము మొదలెట్టాను.  అలాగే ఈ భీషణ ప్రతిజ్ఞను కూడా చిత్తగించండి.. కింద పద్యము చదవటానికి ట్యూను కావాలంటే కృష్ణార్జున యుద్ధము సినిమాలోని కృష్ణుని ప్రతినకు సంబంధించిన ఈ ఘట్టము చూడండి.

సీ:       'మాచిఫిక్సింగు'లు  మాని సద్బుద్ధితో
               ఆడిన  'క్రికెటర్లు'  ఆడవచ్చు
          'ఫేంటసీ' ఆఖరి  'పికు్క' దండిగ నాకు
               ఇచ్చిన పాయింట్లు ఇవ్వ వచ్చు
          వైరమును విడిచి భళియన్చు 'యాంకిఫాన్ '
               తొడిగిన 'రెడ్ సాక్సు'  తొడగవచ్చు
          'ఆఫ్రిక'నేతర్లు 'మారథాన్' పరుగులో
               గెలిచిన అవలీల  గెలవ వచ్చు

తే:       బ్లాగు మిత్ర!!  మీ సాక్షిగ పలుకు చుంటి,
          ఉరికె దను క్రమశిక్షణ తోడ వళ్ళు
          వంచి  'హాఫ్ మారతాన్' మళ్లి;  ప్రతిన తప్పి
          నచొ, సదాగుర్తుచేయని తప్పుమీదె!!!

అది సంగతి. మరి మీ బాధ్యత అర్థమయ్యింది కదా!! నేను కూడా ప్రతి వారము, సాధ్యమైనంతవరకు, నా పురోగమనానికి సంబంధించిన సంగతులు తదితర విషయాలు టపాల రూపములో పంచుకుంటాను. ఇంకా ఎక్కువగా రాస్తుండాలనే సలహా నాకిచ్చిన గౌరవనీయులు అఫ్సరు గారి మాట ఈ విధముగానైనా వినట్టుంటుంది.

 నాతో పాటు మరో మిత్రుడు కూడా పరిగెత్తాలని మొదటి అడుగు వేసాడు. డల్లాస్ లోన డిసెంబరులో జరగబోయే హాఫ్ మారథాన్ లో పాల్గొనాలనేది మా గోల్.  అలాగే మీలో ఎవరైనా మాతో పాటు, ఈ వర్చువల్  ట్రైనింగు  గ్రూపులో  పాలు పంచుకోవాలంటే తెలియచెయ్యండి.  కలిసి విడివిడిగా ఉరుకుదాము.

7 కామెంట్‌లు:

 1. తెలుగుయాంకి గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

  హారం

  రిప్లయితొలగించు
 2. @భాస్కరరామిరెడ్డి గారు, ధన్యవాదాలు. మీకు గూడా వినాయకచవిత శుభాకాంక్షలు - కొంచెము ఆలస్యముగ.
  @భాను, మొదలైతే పెట్టాను. ఈ ముచ్చట ఎన్నాళ్ళుంటుందన్నదే ప్రశ్న.

  రిప్లయితొలగించు
 3. 'తెలుగుయాంకి' దీని అర్ధం తెలుసుకోవచ్చా ......

  రిప్లయితొలగించు
 4. @చేకూరి గారు,
  Yankee పదానికి రక రకాల అర్థాలున్నాయి. బయట వారిక Yankee అనేది అమెరికా వాసికున్న మరోపేరు. Wiki link.

  రిప్లయితొలగించు
 5. సురేష్ గారు,
  మీ 'మారథాన్,' దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించు
 6. తెలుగు యంకి గారూ !
  మీరు నా బ్లాగ్ లో మాతృ భాష మీద పెట్టిన వ్యాఖ్యకి ధన్యవాదాలు.నిజం చెంబితే నమ్మబుల్ గా వుండదు గాని ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు మీరు చదివితే ఏమనుకుంటారో అనే చిన్న ఆలోచన వచ్చింది. మీ బ్లాగ్ ఇప్పుడే నా కంట బడిందండి.చదివి నా స్పందన తెలియ చేస్తాను సుమా!

  రిప్లయితొలగించు