పేజీలు

27, మార్చి 2010, శనివారం

తిరుపతి వెంకట కవులు

ఈ రోజు 'నెలనెలా తెలుగు వెన్నెల' కార్యక్రమానికి విచే్చసిన సాహితీ మిత్రులందరకూ నా హృదయ పూర్వక నమస్కారములు. 'మాసానికో మహనీయుడు' శీర్షికన, ఆయానెలలలో వర్ధంతిగానీ జయంతి గానీ జరుపుకున్న తెలుగు మహానుభావులలో ఒకరిని ఎంచుకొని వారి గురించి సోదాహరణముగా సభికులకు వివరించడము జరుగుతుందన్న విషయము మీకు తెలుసు. ఆ నవయుగ వైతాళికులను సంస్మరించుతూ, వారు తెలుగు భాషకూ, సంస్కృతికీ ఏ విధముగా వన్నె తెచ్చారు అని చరి్చంచుకోవటము ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ మార్చినెలలో కూడా ఎందరో తెలుగు మహనీయుల గూర్చి మనము చెప్పుకోవచ్చు.

తెలుగింటి ఆడ బడుచు 'కాంతం' పాత్రను సృష్టించిన మునిమాణిక్యం నరసింహారావు గారి గురించి మాట్లాడుకోవచ్చు. అభినవ తిక్కన, తెలుగు లెంక తుమ్మల సీతారామూ్మరి్త చౌదరి గారి గురించి చెప్పుకో వచ్చు.

"ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు, తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు రాసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల.”

అంటూ ఎంకిని తెలుగు వారికి పరిచయము చేసిన నండూరి సుబ్బారావు గారి గురించి చెప్పుకోవచ్చు.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

అంటూ దేశభకి్తని తెలుగు వారికి ప్రబోధించిన నవ్యకవితా పితామహుడూ, భావకవులలో ఆద్యుడూ అయిన రాయప్రోలు సుబ్బారావుగారి గురించి మాట్లాడుకోవచ్చు. వీరందరికీ వినమ్రతతో నమస్కరించి, ఇవాళ వీరికి బదులు మరో తెలుగు తేజము గురించి చర్చించుకుందాము.

అది 1977 జనవరి. సంక్రాంతి సందర్భముగ, మహాభారతము ఇతివృత్తముగా గల రెండు తెలుగు చలన చిత్రాలు దాదపు ఒకే సారి పోటా పోటీగా విడుదలయ్యాయి. మొదటి దానిలో తెలుగు చలనచిత్ర ప్రపంచములోని మహొ మహులనదగ్గ వాళ్లందరూ ఉన్నారు... ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ తప్ప. దర్శకుడు, పౌరాణిక బ్రహ్మ కమలాకర కామెశ్వరావు గారు. మంచి మాటలు, పాటలు, చాయాగ్రహణం, కథనం. రెండో దానిలో ఇవన్నీ కొంచెము తక్కువ పాలే. అయినా గూడా 'కురుక్షేత్రం' కన్నా 'దానవీరశూరకర్ణ' సినిమా, ప్రజల హృదయాలలో ఎక్కువ చోటు సంపాదించుకుంది. ఎందువలన?

నటసార్వభౌముని అద్భుతమైన త్రిపాత్రాభినయము వలన గావచ్చు. అలాగే కొండవీటి వెంకట కవి రాసిన సరస చతుర గంభీర సంభాషణలు వలన గావచ్చు. కానీ నా ఉద్దేశ్యములో మాత్రము ముఖ్య కారణము - మరో ఇద్దరు. వారికి వినమ్రతతో నా ఈ ఉత్పలమాలను సమర్పిస్తున్నాను.

ధాటిగ కైతలల్లిరవధానములన్నిట, ఆంధ్రసాహితీ
వాటికి శోభ నీయు బిగి పద్యము హృద్యము గన్ రచించి రా
నాటకరంగ పద్యముల నాటికి నేటికి లేరు వీరికిన్
సాటి; జగత్ప్రసిద్దులగు జంటకవీంద్రుల కంజలించెదన్


వారెవరో మీరు ఊహించే ఉంటారు ఈ పాటికి. తిరుపతి వెంకటకవులు. దివాకర్ల తిరుపతి శాస్తి్ర లో తిరుపతి, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి లో వెంకట కలిపి 'తిరుపతి వెంకటకవులు' అని ప్రసిద్ది పొందారు. నిజానిక మనము ఈ మార్చినెలలో తిరుపతి శాస్తి్ర గారి గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పుట్టిన రోజు, క్రీ.శ. 1872 మార్చి 22న. కానీ ఆయన ఒక్కరి గురించే మాట్లాడటము ఆ జంట కవులకు అంత నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్లు సాధించినవన్నీ జంటగానే చేసారు కాబట్టి.

అదిగో ద్వారక! ఆలమందలవిగో! అందందు గోరాడు, అ
య్యదియే కోట, అదే అగడ్త; అవె రథ్యల్ వారలే యాదవుల్
యదుసింహుండు వసించు మేడఅదిగో; నాలానదంతావళా
భ్యుదయంబై వరమందురాంతర తురంగోచ్చండమై పర్వెడున్

ఈ పద్యాన్ని మీరు వినే ఉంటారు. లేకపోతే ఘంటసాలగారి గొంతులో ఇక్కడ వినవచ్చు. ఇది అర్జునుడు, కృష్ణుని సహాయార్ధము వెడుతూ, ద్వారకాపురి దగ్గరలోకి వచ్చాక చెప్పే పద్యము. ఆ జంట కవులు గనుక ఇవాళ, 'లుయిస్ విల్ 'లోని ఈ 'కోకిల' రెస్టారెంటుకు వచ్చి ఉంటే, ఆ మతే్తభముమీద అమెరికా అంబారీ పరిచి ఈ విధముగా చెప్పేవారేమో!!

అదిగో కోకిల ! వాపొకోడిలవిగో! కమ్మంగ నోరూరు న
య్యదియే హోటలు 'లూస్విల'ందు రుచిగన్, ఆహ్వానితుల్ ఎల్లరు
న్మదికావ్యోల్లస మందు చోటు నదిగో; 'మార్చెనెనుట్టీవి' ఇ
య్యదియే భాసిలు కైతపద్యములతో; ఆహూతి సుస్వాగతం

తిరుపతి శాస్తి్రగారు పశ్చిమ గోదావరి జిలా్ల, భీమవరం దగ్గరున్న యండగండి అనే గ్రామములో జన్మించారు. ఈయన తండ్రి గారైన దివాకర్ల వెంకటావధాని గారు కూడా గొప్ప పండితుడు. ఆయనచే రచింపబడిన కావ్యలహరి అనే వ్యాసాలు సంకలనము చాలా పేరగడించినది.

చదువుకునే రోజులలోనే తిరుపతి శాస్రి్తగారికి వెంకట శాస్ర్ర్ర్తిగారితో పరిచయము కలిగింది. వారు కలిసి అవధానాలు, రచనలు చేయటము మొదలు పెట్టారు. విశ్వనాధ సత్యనారాయణగారి లాగ తిరుపతి శాస్రి్తగారు కూడా సదా వెంకట శాస్తి్రగారిని తన గురువుగానే భావించేవారు. క్రీ.శ. 1920లో తిరుపతి శాస్రి్తగారు చనిపొయాక వెంకటశాస్తి్ర గారు, వారి స్వీయ రచనలను జంట రచనలుగానే ప్రచురించారంటే వారిద్దరి మధ్యన ఉన్న సంబంధము ఎంత గాఢమైనదో అర్థము చేసుకోవచ్చు.

తిరుపతి శాస్రి్తగారి వాదనా పటిమ అసాధారణమైనది. వెంకటశాస్త్రిగారు పురాణ సాహిత్యలలో ఉపన్యాసలు ఇవ్వటములోనూ, ఆశువుగా కవితలల్లటములోనూ దిట్ట. అందుకే వారిద్దరి జోడీ అంత చక్కగా కుదిరింది.

ఇకపోతే వారి రచనల విషయానికి వస్తే బాగా ప్రాచుర్యము పొందినవి 'పాండవ ఉద్యోగవిజయములు'. ఇవి పాండవుల జననము నుండి, విజయము వరకు ఉన్న ఆరు రచనల సముదాయము. వీటిలో గూడా పాండవ ఉద్యోగము మరింత ప్రసిద్ధమైనది. వీటిలోని కొన్ని పద్యపాదాలైనా తెలియని (ఈ జెనరేషను వారు కాదులెండి) తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు అలాంటి కొన్ని ఆణిముత్యాలను గుర్తు తెచ్చుకుందాము..

ఎక్కడనుండి రాక ఇట? కెల్లరున్ సుఖులేగదా? యశో
భాక్కులు నీదుయన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్
చక్కగ నున్న వారె? భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకున్
దక్కగ నిల్చి శాంతుగతి దాను చరించునె తెల్పు మర్జునా!

అని ముందొచ్చిన దుర్యోధనుడిని గాకుండా తదుపరి వచ్చిన అరు్జనుని చూసి చెప్పే పద్యమిది. పాండవులందరి గురించి, ముఖ్యముగా భీముని గురించి ఒక్క పద్యములోనే యోగక్షేమాలు ఎలా అడిగాడో గమనించండి. తరువాత దుర్యోధనుడిని చూసాడు.మరో అజరామరమైన పద్యాన్ని అందుకున్నాడు.

బావా! ఎప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్-సుతుల్-చుట్టముల్?
నీవాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతికోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్

Hey Dude! how are you? అనో, లేక Hey Sam! Whats up? అనో అడిగాడా, లేదు. ఎంత చక్కగా 'ఏరా బావా ఎప్పుడు వచ్చావు'.. అని అడిగితే 'మీ అక్కయ్యను బస్సెక్కించి ఇప్పుడే వచ్చానురా' అని ఎంత చక్కగా సమాధానము చెప్పవచ్చు? అదీ!! మన తెలుగు సంస్కృతంటే. బావా, మామా, అత్తా అని నోరారా పలుకుతాము. అంతే గానీ కజిన్ అనో లేకపోతే అంకులనో ఇంక మరీ అధ్వానముగా క్రిష్ అనో మామను పేరు పెట్టి పిలుస్తామా? మంచినీళ్లు ఇస్తాము. అందరి యోగక్షేమాలనూ కనుక్కుంటాము. పద్యాలలో ఇవన్నీ ప్రతిబింబించేవి కాబట్టే ఇవి అంత జనాదరణ పొందాయి. వీరి భాష సరళముగా సామాన్య పల్లెప్రజలకు గూడా అర్ధమయ్యేట్టుగా ఉండేది.

ఇంకో విషయము.. నాకు గురు్తండగా, మొదటిసారి ఈ పద్యాని్న మా ఊరులో ఎవరో నాటకము వేస్తుంటే విన్నాను. కృష్ణ పాత్రదారి పేరు సుబ్బారావు అనుకుంట. ఈయన ఎన్.టి.అర్ లాగా అందగాడూ గాదూ అలాగే ఘంటసాల గారి లాంటి గొంతూ లేదు. కానీ నాకు మాత్రము ఆయన పాడిన పద్యమే మరింత బాగున్నట్టు అనిపించేది, చాలా రోజులు. అది!! ఆ పద్యము యొక్క గొప్పతనము. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ పద్యము నేను పాడినా బాగానే ఉంటుంది (నాకంత సీను లేదంటారా?). అదీ!!, ప్రజలకు చేరువగా ఉండే కవిత్వము. కష్టపడి అర్ధము చేసుకోవలిసిన ప్రబంధ కవిత్వానికీ దీనికీ గల వ్యత్యాసము చూడండి? వైభవము, సమకాలీనత కోల్పోతున్న పద్య సాహిత్యాని్న ఈ నాటక మాధ్యమము ద్వారా పునరజ్జీవింపజేసి సామాన్య ప్రజల దగ్గరకు దానిని తీసుకెళి్ళన మహానుభావులు ఈ కవిద్వయము.

చెల్లియొ చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందఱుం
తొల్లి గతించె, నేడు నను దూతగ పంపిరి సంధిసేయనీ
పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు సేసెదో
యెల్లి రణంబు కూర్చెదవొ యేర్పడ చెప్పుము కౌరవేశ్వరా!

అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
అలిగిననాడు సాగరము లన్నియు ఏకము కాక పోవు క
ర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్

జెండాపై కపిరాజు ముందు సిత వాజశ్రేణియుం కూర్చి నే
దండంబుం గొని తోలు స్యందనము మీద న్నారిసారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం చెండుచున్నప్పు డొ
క్కండు న్నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్

వీటిని ఇక్కడ వినవచ్చు..


ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒకటి తరువాత ఒకటి ఆణిముత్యమే. ఉద్యోగ విజయాలే గాకుండా మరెన్నో తెలుగూ, సంస్కృత రచనలూ, అనువాదాలూ చేసారు. అవధాన ప్రక్రియలెన్నో చేసి ఆ కళను రాజాస్ధానములనుంచి జనబాహుళ్యములోకి తీసుకొచ్చారు.
సహజంగానే మహా కళాకారులకుండే స్వాభిమానము, అంటే ఒక రకమైన ఇగో వీరికి గూడా ఉండేదేమో? ఒక సారెవరో "పద్యాలు చెప్పుకునే మీకు మీసాలెందుకు?" అని అవహేళనముగా అడిగితే వారు ఈ విధముగా సమాధానము చెప్పారంట

దోసమటంచు ఎరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసలు తీసి మీ పద సమీపమునం దలలుంచి మ్రొక్కమే

అలాగే వీరు చతుర సంభాషకులుగూడాను. ఒకసారి ఓ అవధాన సభలో అప్రస్తుతప్రసంగి " అవధాని గారూ! చీకట్లో అరసున్న ఉంటుందా? " అని అడిగాడట. గ్రాంథిక తెలుగులో ఏ పదంలో అరసున్న ఉంటుందో, ఎందులో ఉండదో చెప్పటము ఎలాగో నాకైతే తెలియదు. మరి వారికి తెలుసో లేదో. "చీకటి కదండీ, అరసున్న ఉందో లేదో కనబడటం లేదు! " అని ఎంతో చమత్కారముగా తప్పించుకున్నారంట.

ఇలా చెప్పుకుంటూ పోతే వారి గురించి మరెన్నో సంగతులు. కానీ సమయము చాలదు. టూకీగా.. సాహిత్యమనేది ప్రజాదరణ పొందాలంటే ఎలా రాయాలి, సమకాలీన విషయాల మీద ఏ విధముగా శ్రద్ద చూపించాలి అనే విషయాలు వీరికి బాగా తెలియటము వలననే అంత ప్రసిద్ధినొందగలిగారు. ఆ విధముగా వీరు ప్రజా కవిత్వము రాయటానికో BluePrint మనకందించారు.

8 కామెంట్‌లు:

  1. మిము బోలిన వానొక్కని
    గుమి యందునఁ గాంచి యుంటి గోప్యము నతడున్
    సమ కట్టెను మీ పలుకులఁ
    దమకించకఁ దస్కరించఁ దానే మీరై !

    గన్నవరపు నరసింహ మూర్తి

    రిప్లయితొలగించండి
  2. @ఆజ్ఞాత, @మందాకిని, గన్నవరపుగారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. మంచి అంశమని తెలిసిపోతుంది..వీరితో పాటుగా మరి నలుగురునీ స్మరించుకునేలా చాలా బాగా రాసారు. దానితో పాటుగా చిన్నప్పటి జ్ఞాపకాలు తవ్వుకునే విధంగాను, మా నాన్నగారు మంచి నాటకానుభవం ఉన్నవారు, ఈ పద్యాలు ఎక్కువగా ఉదయం పూట పాడేవారు. అలా తాజా బుర్రల్లో పదే పదే విని ఎక్కేసిన పద్యాలివి. ఇక తిరుపతి వెంకటకవులను గూర్చి నేను మరొక విషయం చదివాను [ఆధారం: http://www.visalaandhra.com/literature/article-7318]

    తిరుపతి వెంకటకవుల భావానువాదానికి ప్రాముఖ్యతనిస్తూ ఇలా అంటారు.

    ''ఒక్కెడ జక్కగా పదము నొక్కెడ జేర్చిన ముచ్చటా మరిం

    కొక్కెడ నున్న దున్నయటులుంచిరచించిన ముచ్చటా మరిం

    కొక్కెడ నున్న దానసగముంచిన మేలగు, దెల్గుసేయుచో

    మక్కికి మక్కి యన్నటులు మార్చిన గావ్యముశ్రావ్యమెట్లగున్‌''

    వారి అభిప్రాయానికి అనుగుణంగా Edwin Arnoldµ రాసిన »light of Asia 'బుద్ధచరిత్రము' గా తెలుగులోకి అనువదించి చూపించారు. వేంకటకవుల సూచనలనే ఇంచుమించు మన కవులందరు అనుసరించారు.

    రిప్లయితొలగించండి
  4. కళ్ళెత్తితే సాలు కనకాబిసేకాలు :)

    రిప్లయితొలగించండి
  5. మీ రచనా చమత్కారం బాగుంది. మీ బ్లాగుకి నేను చాలా కాకతాళీయంగా రావడం తటస్థించింది. మీ పద్యాలు బాగున్నాయి. కాని మీరు కోట్ చేసిన పద్యాలలో కొన్ని పాఠాంతరాలులా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి కవుల పద్యాలలో. మీ పద్యం చివరిపాదంలో,

    జగత్ప్రసిద్దులగు జంటకవీంద్రుల కంజలిచ్చెదన్,బదులు
    "జగత్ప్రసిద్దులగు జంటకవీంద్రుల కంజలించెదన్," అంటే ఇంకాబాగుంటుందేమో చూడండి
    "పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు సేసె" బదులు
    "పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు సేసెదో " అని ఉండాలి

    మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే
    "మీసలు దీసి మీ పదసమీపమునందలలుంచి మ్రొక్కమే " అని ఉండాలి
    ఇక్కడ మీసలు అన్నది వాళ్ళు మీసములకు బహువచనంగా కొంటెతనంతో వాడినదే .

    మీకు నా హృదయపూర్వక అభినందనలు

    రిప్లయితొలగించండి
  6. @sunamu నా బ్లాగుకొచి్చ మీ అభిప్రాయము పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు చెప్పిన మార్పులు చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి